TN 24X7 - వార్తలు / : దసరా నవరాత్రి ఉత్సవాలు 2024 అక్టోబర్ 03వ తేదీ గురువారం ఘట స్థాపనతో మొదలై.. అక్టోబర్ 12, శనివారం విజయ దశమి వేడుకతో ముగుస్తాయి. ఈ సమయంలో తొమ్మది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపధ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరుగనున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు. నవరాత్రులకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు శరవేగంగా చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా వచ్చిందంటే చాలు నవరాత్రుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. గతేడాది దసరా ఉత్సవాలకు 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా విపరీతమైన ఎండ కాసినా.. వర్షం వచ్చినా క్యూలైన్లలో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్స్ ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రికి వెళ్తాయి.
Admin
TN 24X7