TN 24X7 - వార్తలు / : ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, విష్వక్‌సేన్, అనన్య నాగళ్ల, సిద్ధ జొన్నలగడ్డ, అశ్వనీదత్, త్రివిక్రమ్.. వంటి సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భువనేశ్వరి గుర్తు చేశారు. వరదల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, ప్రతి ఒక్కరికీ హెరిటేజ్ ఫుడ్స్ అండగా ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్రాలు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.
Admin
TN 24X7